ప్రియురాలి ప్రేమలేఖ

ప్రియురాలి ప్రేమలేఖ

K_Hitesh
K_Hitesh
Jan 19, 2016, 1:16 AM |
0

ప్రియ సఖా,

నువ్వు నన్ను వీడి వెళ్ళిన క్షణం నుంచి నువ్వు లేవనే నిజాన్ని నా మనసెందుకు ఒప్పుకోవడంలేదు?

బహుశా నాలో ఉన్న నువ్వు అందుకు అంగీకరించడం లేదా!

అందుకేనేమో...

పంచభూతాలైన నీరు.. నిప్పు.. గాలి.. నింగి.. నేలా.. ఆ విషయాన్నే ప్రతిరోజూ నొక్కి చెప్తున్నాయి.

స్నానపు వేళ నా తనువుని తడిపే ప్రతి నీటి బొట్టు నీ స్పర్శనే గుర్తుకుతెస్తుంది.

మిట్ట మధ్యాహ్నపు వేడి గాలులు నీ ఊపిరి సెగల్ని,

సాయంత్రపు శీతల పవనాలు నీ కౌగిలి వెచ్చదనాన్ని,

అర్దరాత్రి నిర్మల ఆకాశం నన్ను చుట్టేసే నీ అంతులేని ప్రేమను స్ఫురణకు తెస్తుంది.

ఇక నన్ను మోసే ఈ నేల సంగతో అంటావాటా...

ఛి పో!!

పవళింపు వేళ నా భారాన్ని మోసే నీ వక్షస్థలం ముందు అదెంత!?

 

ఓ రహస్య స్నేహితుడా...

నువ్వు నేను ఒకటేనని వేరు కాదని

నా మనసు, పంచభూతాలు చెప్తున్నా..

ఎందుకురా ఈ తత్తరపాటు?

నీ పేరు పలుకుతుంటే నా పెదాలు అదురుతున్నాయి,

వాటి మీద నీ మునివేళ్ళు చేసిన నృత్యాలు గుర్తుకు వచ్చా!?

నా అడుగులు తడబడుతున్నాయి,

నిన్ను చేరలేక కాదు... అన్నీ వైపులా ఉన్న నిన్ను ఏ వైపు కలుసుకోవాలో తెలియక!

చూపులు నిలవట్లేదు,

ప్రతిచోటా నీ రూపం దర్శనమిస్తుంటే ఏది నిజమో పోల్చుకోలేక తికమకపడి.

చెక్కిళ్లు ఎరుపెక్కాయి.... తమపై చిటికెలు వేసే మగరాయుడు రాడే అని.

ఇక నా ముంగురులు అయితే ఒకటే గొడవ,

గాలికి సయ్యాటాడే తమని సవరించే పురుషుడు లేడే అని.

చెవుల్లో నీ గుసగుసలు రాగాలు ఆలపిస్తుంటే ఉద్వేగంతో యద ఉప్పొంగుతున్నది,

దాన్ని లాలించి పాలించే బాధ్యత నీది కాదూ!?...

పాదాలు తమ ముద్దుకై ఆరాటపడుతున్నవి.

క్షణక్షణ విరహాన్ని వెన్నెల చిలికితే,

వికసించిన వలపు పుష్పం విరబూసింది....

పుప్పొడి దోచే తుమ్మెదలా అమాంతం వచ్చి వాలిపో... సొగసు మకరందాన్ని దోచుకో... నీలో దాచుకో...

 

ఓ ధీరోధాత్త సైనికుడా...

అందుకే

నిన్ను చేరాలనే నా తలపుని మధించి

అక్షరమాలగా చేసి పంపుతున్నా... వరమాలగా వేసుకొని యుద్దంలో గెలిచి విజయుడివై తిరిగిరా.

సరిహద్దు అవతలే కాదు ఇవతల కూడా మరో యుద్దం చేయాలి సుమీ!...

కుతంత్రం చొప్పని రణతంత్రంలో,

నియమాలు ఎరుగని నిశిత దాడి చై

పరతంత్రం అయ్యే స్వతంత్రం నీకోసం ఎదురు చూస్తుంది.

తడి స్పందనలు తెలిపే వెచ్చని పరుగులో

ఏకాత్మకతను పొందే ద్విగుణ ప్రయాణానికి నీకు ఇదే నా స్వాగతం.... సుస్వాగతం!!

 

ఓ రాక్షసుడా...

రాత్రి రాకసుడా

 

త్వరగా రారా సామి...