నేను భారతదేశాన్ని

నేను భారతదేశాన్ని

K_Hitesh
K_Hitesh
Aug 14, 2016, 8:30 AM |
1

నేను నవ్వుతాను

నవ్విస్తాను కూడా

నేను ఏడుస్తాను

ఏడిపిస్తాను కూడా

ఎంతో విశాలం నా విస్తారం,

నడవడానికి మాత్రం జాగా దొరకదు.

అక్కడనిలేదు ఇక్కడనిలేదు,

ఎక్కడ చూసినా ఇరుకుతనమే.

మహా వైవిధ్యభరితం నా చరితం,

విరుద్దభావజాలానికి కూడా నేనే నిలువుటద్దం.

ప్రపంచానికి నన్ను పూజగది అంటారు,

వాళ్ళే

బహిరంగ పాయఖానాకి ప్రతిరూపంగా మళ్ళీ నన్నే చూపిస్తారు.

అధ్వైతాన్ని ప్రవచించనూ గలను

ఆజ్ఞానాన్ని శ్వాసించనూ గలను

అయినా సరే, ఆధ్యాత్మికతే నా బలం!

మూఢత్వమే నా బలహీనత!!

చందమామని రమ్మని పిలుస్తా,

అలిగి అది రానంటే రాకెట్టేసుకుని నేనే అక్కడికి వెళ్తా.

విశ్వాంతరాలని ఒడిసిపట్టడంలో నేనెప్పుడూ ముందే,

విశ్వక్రీడల ఎవణికిపై మాత్రం అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి.

బ్యాటెత్తి కొడితే బంతి అంత దూరంలో పడుతుంది,

అదే బంతిని చేత్తో విసిరి పతకం గెలవడం మాత్రం తెలీదు.

వేదాలని వల్లెవేయలేనేమో గాని యాంత్రిక భాష మాత్రం బాగా కంఠస్థం,

గాలి సొకకుండా కింద కాలికి కంకణం కట్టేసుకుంటా,

పైన ల్యాప్టాప్ మీద మాత్రం చేతులు టకటక లాడిస్తా,

ఎంతటి తోపు కంపెనీ అయినా నా సారధ్యంలో నడవాల్సిందే,

అయితే ఏంటి? ప్రాధమిక విధ్య నాకు ఇంకా మిధ్యే!!

నేను ఎప్పుడూ ఉదయించడానికి సిద్దంగా ఉన్న సూర్యుడినే,

ఎప్పుడు ఉదయిస్తానో మాత్రం చెప్పలేను.

సున్నాని కనిపెట్టానని జబ్బలు చరుచుకుంటా గాని,

దాన్ని దాటి ముందుకెళ్లాలని మర్చిపోయా.

ఇప్పుడిప్పుడే మేల్కోన్నా,

ఇహ కాసుకో...

ఆట ఇంకా మిగిలే ఉంది!

ప్రపంచం ఎప్పుడూ నా వైపు ఆశగానే చూస్తుంది,

ఆశ నెరవేర్చను, అలాని తగ్గించను కూడా.

లోక్యంలో నాకు నేనే సాటి,

బద్దకంలో నాకు ఎవరు పోటీ?

నా ఆతిధ్యం అమోఘంగా ఉంటుంది,

పన్లే తిక్కతిక్కగా ఉంటాయి.

ఏంటి,

నన్ను అర్దం చేసుకోవాలని ఉందా?

అతిగా ఆలోచించకు,

నీ తార్కానికి అందనిదే నా నైజం

నీ ఆలోచన అందుకోలేనిదే నా వ్యక్తిత్వం

ఎందుకంటే

నేను భారతదేశాన్ని

డెబ్భై సంవత్సరాల యువ రక్తాన్ని

నన్ను చూసి నవ్వుకుంటావా?

పట్టించుకొను.

వెక్కిరిస్తావా??

దులిపేసుకుంటా.

కానీ మెత్తగా ఉన్నా కదా అని మొట్టాలని చూశావా... విరిచిపారేస్తా!

గుర్తుంచుకో..

నేను భారతదేశాన్ని!

డెబ్భై సంవత్సరాల యువ రక్తాన్ని!!

 

HAPPY INDEPENDENCE DAY!!!